ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.20,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ఒకటో పట్టణ సీఐ కొండారెడ్డి తెలిపారు.

జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని REDDY.99.APP ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు హుస్సేన్, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

ఈ అరెస్ట్‌ను ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఎస్సై మొయినుద్దీన్ చేపట్టగా, వారి వద్ద నుంచి రూ.20,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, బెట్టింగ్‌కు పాల్పడటం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు.

అలాగే, ఆన్‌లైన్ బెట్టింగ్ లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ప్రజల దృష్టికి వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కొండారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.