విజయనగరం జిల్లాలో అమానుషం: బైక్ రిపేర్ డబ్బుల కోసం యువకుడిపై దౌర్జన్యం
భోగాపురం: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది. బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడిపై మెకానిక్ మహేష్, అతని స్నేహితులు బరితెగించి దౌర్జనానికి పాల్పడ్డారు.
బాధితుడి చొక్కా బలవంతంగా విప్పేసి, చేతులకు మరియు మెడకు తాళ్లు కట్టి రోడ్డు వెంట నడిపించారు. అంతటితో ఆగకుండా బైక్‌కు కట్టి వీధుల వెంట ఈడ్చుకుంటూ వెళ్లిన అరాచక ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ అఘాయిత్యానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, నిందితులలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు మరికొన్ని తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
