గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు.

శనివారం కొండపాక మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల , మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన కలెక్టర్.. కామన్ డైట్ మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.

స్టోర్ రూమ్ నుంచి వంట సరుకులను విద్యార్థుల 'మెస్ కమిటీ' సమక్షంలోనే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అటెండెన్స్, ఓపీ రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బంది సమయపాలనను పరిశీలించారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులపై ఏఎన్ఎం, సూపర్‌వైజర్లతో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఆసుపత్రిలో తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. ప్రతివారం శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మండల వైద్యాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు