రఘురామకృష్ణంరాజు రూ. 237 కోట్ల బ్యాంకుల కుంభకోణం కేసులో సుప్రీం షాక్
టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రూ. 237 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసి, నిధులను పక్కదారి పట్టించిన కేసులో తనపై ఉన్న సీబీఐ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ (క్వాష్ పిటిషన్) వేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు నిర్దాక్షిణ్యంగా కొట్టివేసింది.
ఇన్నాళ్లూ మీడియా ముందుకు వచ్చి నీతులు వల్లించిన రఘురామకృష్ణంరాజు ఆర్థిక అక్రమాలు, బ్యాంకుల దోపిడీ బండారం సుప్రీంకోర్టు తీర్పుతో పూర్తిగా బట్టబయలైంది.
ఏంటి ఈ రూ. 237 కోట్ల బ్యాంక్ స్కామ్
- ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ (A1) పేరుతో పవర్ ప్లాంట్ల ఏర్పాటు, వ్యాపార అవసరాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రఘురామ రూ. 237.84 కోట్లు రుణాలుగా పొందారు.
- ఈ రుణ నిధులను అసలు ప్రాజెక్టులకు వాడకుండా, నకిలీ కొనుగోలు పత్రాలు, తప్పుడు అకౌంట్లను సృష్టించి గ్రూప్ కంపెనీలకు మళ్లించారని బ్యాంకులు ఆధారాలతో ఫిర్యాదు చేశాయి.
- ఈ భారీ కుంభకోణంపై రంగంలోకి దిగిన సీబీఐ.. రఘురామకృష్ణంరాజు, ఇతర డైరెక్టర్లపై ఐపీసీ సెక్షన్లు 120-బీ (కుట్ర), 420 (మోసం), 467, 468, 471 (ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి)తో పాటు అవినీతి నిరోధక చట్టం (PC Act) కింద క్రిమినల్ కేసులు నమోదు చేసింది.
సుప్రీంకోర్టు ఘాటు ఆదేశాలు..
- జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆర్థిక నేరాల విచారణలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.
- గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దర్యాప్తు అధికారి (IO) 16 వారాల్లోగా పూర్తిస్థాయి విచారణను పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయాలన్న ఉత్తర్వులను యథాతథంగా సమర్థించింది.
- రఘురామకృష్ణంరాజుతో పాటు ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ డైరెక్టర్లు కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, రమాదేవి, దుంపల మధుసూధన రెడ్డి, అంబేడ్కర్ రాజ్‌కుమార్ గంటా, నారాయణ ప్రసాద్ తదితరులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లన్నింటినీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
- పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదిస్తూ.. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, స్వతంత్ర డైరెక్టర్ల వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పగా, "ఈ వాదనలను హైకోర్టులోనే ఎందుకు వినిపించలేదు?" అని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం నేరుగా ప్రశ్నించింది.
