మలేషియా వెళ్లే విమానంలో ఇద్దరు ప్రయాణికుల అరెస్ట్‌ ట్రాలీ బ్యాగుల్లో దుస్తుల మధ్య నోట్ల కట్టలు దాచినట్లు గుర్తింపు హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. అక్రమంగా విదేశీ నగదును తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఇద్దరు భారతీయ ప్రయాణికులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు అక్టోబర్‌ 22, 23 తేదీల్లో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 22న హైదరాబాద్‌ నుంచి మలేషియాలోని కౌలాలంపూర్‌కు ఎయిర్‌ఏషియా విమానంలో వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడిని డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.