హైదరాబాద్‌లో ఈ ఏడాది వర్షాకాలంతో భూగర్భ జలాల్లో స్వల్ప మెరుగుదల కనిపించినా.. గత ఏడాది లోటు కారణంగా ఇంకా అడుగంటే ఉన్నాయి. 2026 ఆగస్టులో సగటు నీటిమట్టం 11.20 మీటర్లకు పడిపోగా.. గత ఏడాది 6.36 మీటర్లుగా ఉంది. కుత్బుల్లాపూర్‌లో ఏకంగా 39.89 మీటర్ల లోతు నమోదైంది. లోటు వర్షపాతం, వర్షపు నీటి రీచార్జ్ లోపాలు పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. అయితే మేతో పోలిస్తే ఆగస్టులో 0.80 మీటరు పెరుగుదల నమోదైంది. 11 మండలాల్లో నీటిమట్టం ఇంకా 20 మీటర్లకు మించి లోతులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్‌లో ఈ ఏడాది వర్షాల కారణంగా భూగర్భ జలాల పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ.. గత ఏడాది నమోదైన భారీ లోటును పూర్తిగా పూడ్చే స్థాయిలో మాత్రం పునరుద్ధరణ జరగలేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తీరులో వచ్చిన మార్పులు, ఈ ఏడాది లోటు వర్షాలతో నగరంలో భూగర్భ జలాలపై ఒత్తిడి మరింత పెరిగింది. భూగర్భ జలాల శాఖ తాజా అంచనాల ప్రకారం.. 2026 ఆగస్టులో హైదరాబాద్‌లో సగటు భూగర్భ జల మట్టం 11.20 మీటర్ల లోతులో నమోదైంది. 2025 ఆగస్టులో ఇది 6.36 మీటర్లుగా ఉండేది. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే సగటు నీటిమట్టం దాదాపు ఐదు మీటర్లు లోతుకు పడిపోయింది. నగరంలోని ఉత్తర, వాయవ్య, తూర్పు ప్రాంతాలతో పాటు వేగంగా పట్టణీకరణ చెందుతున్న నగర దక్షిణ శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.

ముఖ్యంగా కుత్బుల్లాపూర్‌లో తీవ్ర లోటు నమోదైంది. అక్కడ ఆగస్టులో భూగర్భ జల మట్టం 39.89 మీటర్ల లోతులో నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో 14.15 మీటర్లుగా ఉండగా.. ఏకంగా 27.74 మీటర్ల తేడా కనిపించింది. తిరుమలగిరిలో 13.73 మీటర్ల పతనంతో నీటిమట్టం 17.68 మీటర్లకు చేరింది. మారేడ్‌పల్లిలోని 12.97 మీటర్ల మేర పడిపోయాయి. శేరిలింగంపల్లి, మేడిపల్లి, మేడ్చల్, ఉప్పల్, కూకట్‌పల్లి, హఫీజ్‌పేట్ ప్రాంతాల్లోని పలు కేంద్రాల్లోనూ గణనీయమైన వార్షిక పతనం నమోదైంది.

ఈ పరిస్థితికి లోటు వర్షపాతం ప్రధాన కారణాల్లో ఒకటిగా అధికారులు, నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు వరకు హైదరాబాద్‌కు సాధారణంగా 460 మిల్లీమీటర్ల వర్షపాతం రావాల్సి ఉండగా.. 360 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 22 శాతం లోటు ఏర్పడింది. పర్యవేక్షణలో ఉన్న 46 మండలాల్లో 28 మండలాల్లో లోటు వర్షపాతం, 17 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. ఒక్క మొయినాబాద్‌లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది.