ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? మహిళలు, పురుషులకు వేర్వేరుగా లిమిట్స్.. ఐటీ శాఖ రూల్స్ ఇవే!
Gold Jewellery Tax Rules: చాలా మంది ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీనిని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తుంటారు. అయితే ఇంట్లో ఎంతైనా బంగారం ఉంచుకోవచ్చా? దీనికి ఏమైనా పరిమితులు ఉంటాయా? చట్టపరంగా ఇంట్లో ఎంతైనా బంగారం ఉంచుకోవచ్చు. అయితే ఆదాయపు పన్ను సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా కొంత వరకు బంగారం ఉంచుకునేందుకే అనుమతులు ఉంటాయి. ఆ పరిమితి దాటితే ఆధారాలు చూయించాల్సి ఉంటుంది.
Income Tax Gold Rules : భారతీయులకు బంగారం అంటే ఎంతో ఆసక్తి, ఇష్టం ఉంటుంది. ప్రతి ఇంట్లో ఇది ఒక భాగమే. పెళ్లిళ్లు పండగలు, ఇతర శుభకార్యాల వేళ కచ్చితంగా కొనుగోలు చేస్తుంటారు. ఇంకా దీనికి తోడు వారసత్వంగా రావడం, గిఫ్ట్స్ రూపంలో పొందడం వంటి కారణాలతో చాలా మంది ఇంట్లో బంగారు ఆభరణాలు ఉంటాయి. అయితే ఇంట్లో ఎంత వరకు బంగారం ఉండొచ్చు.. దీనికి ఏమైనా పరిమితులు ఉంటాయా అని ఎప్పుడైనా ఆలోచించారా? పరిమితికి మించి ఇంట్లో బంగారం ఉంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేస్తారా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా 100 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాములు అనే లిమిట్స్ గురించి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంటోంది. అయితే ఇవి బంగారం కొనడానికి లేదా ఇంట్లో ఉంచుకోవడానికి ప్రభుత్వం విధించిన పరిమితులు కావని తెలుసుకోవాలి.
ఒక వ్యక్తి తన దగ్గర 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంచుకోకూడదు. మహిళలు 250 లేదా 500 గ్రాములకు మించి బంగారం పెట్టుకోకూడదు అనే నిబంధనలు ఏం లేవు. చట్టబద్ధంగా సంపాదించిన డబ్బుతో బంగారం కొనుగోలు చేసి ఉంటే లేదా వారసత్వంగా, బహుమతుల రూపంలో వచ్చినట్లు సరైన ఆధారాలు ఉన్నట్లయితే, ఎక్కువ మొత్తంలో బంగారం ఉన్నా అది ఒక్క కారణంతోనే అక్రమ సంపాదనగా మారదు.
అయితే సాధారణంగా ఇంట్లో ఎంతైనా బంగారం దాచుకోవచ్చు. అదే ఒకవేళ ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించే సమయంలో బంగారం నగల్ని సీజ్ చేయడానికి సంబంధించి మాత్రం కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. వీటినే చాలా మంది బంగారం ఉంచుకోవడానికి పరిమితులుగా భావిస్తున్నారు. అంటే ఐటీ శాఖ సోదాల సమయంలో కొంత పరిమితి వరకు బంగారు నగల్ని సీజ్ చేయకుండా ఉండేందుకు ఇచ్చిన మార్గదర్శకాలు ఉన్నాయి. వీటి ప్రకారం వివాహిత మహిళ 500 గ్రాముల వరకు బంగారం ఎలాంటి ఆధారాలు లేకుండా ఉంచుకోవచ్చు. అవివాహిత మహిళ విషయంలో ఈ పరిమితి 250 గ్రాములుగా, పురుషులకు 100 గ్రాములుగా పరిమితి ఉంది.
