వాహనదారులు నిబంధనలు పాటించాలి: ట్రాఫిక్‌ ఎస్‌ఐ బాల చంద్రుడు గద్వాల: గద్వాల పట్టణంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్‌ ఎస్‌ఐ బాల చంద్రుడు సూచించారు. దుర్గామాత ఉత్సవాలు, దసరా పండుగ నేపథ్యంలో దుకాణాలు, వ్యాపార సముదాయాల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దుకాణాల ముందు రహదారులపై వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయకుండా, నిర్ణీత ప్రదేశాల్లోనే పార్కింగ్‌ చేయాలని సూచించారు. వ్యాపారులు కూడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించినా, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా ఎంతటి వారిపైనైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. పండుగల సమయంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.