ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 24వ విడతగా రూ.2,000 పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేసుకోవాల్సిందేనని స్పష్టమైంది. గతంలో 23వ విడత సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి ఖాతాల్లో నగదు జమ కాలేదు. ప్రస్తుతం అధికారిక పోర్టల్‌లో సాధారణ రైతులకు నేరుగా కేవైసీ చేసుకునే అవకాశం అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ ప్రక్రియను ముగించవచ్చని అధికారులు వెల్లడించారు.

👉 * సీఎస్‌సీ కేంద్రాల ద్వారా: గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) వీఎల్‌ఈ లాగిన్ ద్వారా ఆధార్ కార్డు, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ వివరాలు అందించి బయోమెట్రిక్ విధానంలో కేవైసీ చేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం నిర్దేశించిన నామమాత్రపు రుసుము మాత్రమే చెల్లించాలి.

👉 * మొబైల్ ఫేస్ రికగ్నిషన్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి ‘పీఎం కిసాన్’తో పాటు ‘ఆధార్ ఫేస్ ఆర్‌డీ’ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పీఎం కిసాన్ యాప్‌లో బెనిఫిషియరీగా లాగిన్ అయి, ‘ఫేషియల్ ఈ-కేవైసీ’ ఎంపిక చేసుకుని కెమెరా ద్వారా ముఖాన్ని స్కాన్ చేసి క్షణాల్లో కేవైసీ పూర్తి చేయవచ్చు.

 👉* అధికారిక లాగిన్ల ద్వారా: క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, స్థానిక ప్రభుత్వ సిబ్బంది వద్ద ఉండే అధికారిక స్పెషల్ లాగిన్ల సాయంతోనూ పెండింగ్ కేవైసీని పూర్తి చేసుకునే సదుపాయం ఉంది.

మధ్యవర్తులను నమ్మొద్దు..

గ్రామీణ ప్రాంతాల్లో కేవైసీ పేరుతో కొందరు దళారులు రైతుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులకు ఎలాంటి నగదు ఇవ్వొద్దని, అధికారిక మార్గాల్లోనే ఉచితంగా లేదా ప్రభుత్వ నిబంధనల మేరకే రుసుము చెల్లించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని హెచ్చరించారు.