హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వడ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు, ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది,ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహా గణపతి’గా భక్తులకు దర్శనమిచ్చిన గణ నాథుడు శోభాయాత్ర పూర్తి చేసుకుని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమయ్యారు. 

శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఖైరతాబాద్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంది. యాత్ర ప్రారంభ సమయంలో దానం నాగేందర్ గణపతి ఎదుట డ్యాన్స్ చేసి సందడి చేశారు. 

మార్గమధ్యంలో భక్తుల జయజయ ద్వావాలు, 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో నగర మంతా మార్మోగింది. ఎన్డీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనం తరం.. మధ్యాహ్నం 2.15 గంటలకు భారీ క్రేన్ల సాయంతో మహాగణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. 

ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో ఉత్సవం విజయవంతంగా ముగిసింది.