కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం వరకు కిలో రూ.50గా ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.70 నుంచి రూ.80 వరకు చేరింది.
రెండు నెలల క్రితం కిలో ఉల్లి ధర సుమారు రూ.20 ఉండగా.. కొద్ది కాలంలోనే ధరలు గణనీయంగా పెరిగాయి.
మలక్‌పేట మార్కెట్‌లో క్వింటాల్ రూ.5,500 వరకు
హైదరాబాద్‌లోని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి క్వింటాల్ ధర రూ.5,200 నుంచి రూ.5,500 వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి మాత్రమే ఉల్లి సరఫరా అవుతోందని, రోజుకు సుమారు 5,200 నుంచి 6,000 క్వింటాళ్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
మార్కెట్‌కు ఉల్లి రాక తగ్గడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
రూ.100కు చేరే అవకాశం?
ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే మరో వారం, పది రోజుల్లో ఉల్లి ధర కిలో రూ.100కు చేరువ కావచ్చని కమీషన్ ఏజెంట్లు అంచనా వేస్తున్నారు.
ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు వినియోగదారులు ఉల్లి వాడకాన్ని తగ్గిస్తుండగా.. పానీపూరీ, మిర్చి బజ్జీ వంటి చిరుతిండి వ్యాపారాల్లోనూ ఉల్లి వినియోగాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది.
ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు
పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్‌లో ఉన్న ఉల్లిని మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది.
ఉల్లి ధరల అంశంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిపారు.
ఏపీకి భారీగా ఉల్లిని సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించిందని పేర్కొన్నారు.
ఏపీలో కిలో రూ.32కే ఉల్లి
కేంద్రం నుంచి వచ్చే ఉల్లిని రాయితీ ధరకు ప్రజలకు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా కిలో ఉల్లిని రూ.32కే విక్రయించేందుకు చర్యలు చేపడుతోంది.
నగరాల్లోని రైతు బజార్ల ద్వారా రాయితీ ఉల్లిని వినియోగదారులకు అందించనున్నారు.
కొత్త పంట వస్తే ధరలు తగ్గే అవకాశం
ఉల్లి ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి 2 నుంచి 3 నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
