AI కెమెరా పొరపాటు.. పోలీసుల ముందుకు కారు ఓనర్

కర్ణాటక: హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపినందుకు సాధారణంగా ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధిస్తుంటారు. కానీ కర్ణాటకలోని బెల్గామ్ జిల్లా అథనిలో మాత్రం ఓ కారు డ్రైవర్‌కు హెల్మెట్ ధరించలేదంటూ జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది.

అథనిలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన AI కెమెరా ఓ కారును ఫొటో తీసింది. అనంతరం ఆటోమేటిక్ ట్రాఫిక్ చలాన్ వ్యవస్థ ద్వారా కారు నడిపిన వ్యక్తికి జరిమానా విధించినట్లు అతడి వాట్సాప్‌కు మెసేజ్ వచ్చింది. అయితే.. ఆ చలాన్‌లో ‘హెల్మెట్ ధరించలేదు’ అనే కారణం ఉండటంతో కారు యజమాని సుభాష్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.

దీంతో అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు సుభాష్ ఏకంగా హెల్మెట్ ధరించి కారులో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులను కలిసి.. “కారు నడిపేవాళ్లు కూడా హెల్మెట్ ధరించాలా?” అంటూ ప్రశ్నించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు తమ వ్యవస్థలో పొరపాటు జరిగినట్లు గుర్తించారు. AI కెమెరా ద్వారా తప్పుగా జారీ అయిన జరిమానాను రద్దు చేసినట్లు వెల్లడించారు.

ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. AI కెమెరా అయినా.. పొరపాటు మాత్రం మనుషులదే! అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.