కొన్నాళ్ల తరవాత సమంతుడు మళ్లీ వచ్చాడు. భిక్షువు ఈసారి ‘బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’ అనే త్రిరత్నాల్ని శరణువేడమని చెప్పి పంపాడు. అవి కూడా సమంతుడికి శాంతిని ఇవ్వలేక పోయాయి. ‘స్వామీ... మీరు చెప్పినవి ఏవీ నాకు మనశ్శాంతిని చేకూర్చలేదు. నా చింత, దుఃఖం తీరలేదు.’ అని చెప్పాడు. సమంతుణ్ని సరైన దారిలో పెట్టడం తన వల్ల కాదని గ్రహించిన ఆ భిక్షువు అతణ్ని బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్లి విషయమంతా చెప్పాడు. బుద్ధుడు ఆ యువకుడికి ధర్మోపదేశం చేశాడు.‘సమంతా! మనిషికి మనసే మూలం. సుఖదుఃఖాలకు, కోరికలకు అన్నింటికీ అదే కేంద్రం. చిత్తాన్ని సంస్కరించకుండా బాహ్య విషయాలపై ఎంత సాధన చేసినా ఉపయోగం లేదు. మనసు తనకు ఇష్టమైన విషయాల మీదికి వేగంగా పోయి వాలుతుంది. తెలివిగలవాడు ముందుగా దాన్ని మంచి మార్గంలోకి మళ్లించుకుంటాడు. అప్పుడే దుఃఖాన్ని తొలగించుకుని ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చుకోగలుగుతాడు’ అన్నాడు. అప్పుడు కానీ సమంతుడికి అసలు విషయం బోధ పడలేదు. మార్పు మూలంలోనే రావాలి. అలాంటి మార్పే సుస్థిరంగా ఉంటుంది. అదుపు చేయాల్సింది కోరికల్ని కాదు, కోరికల మూలమైన చిత్తాన్ని అని తెలుసుకుని ఆ దిశగా ప్రయాణం కొనసాగించాడు.