సోషల్ మీడియాలో ప్రచారమైన న్యూస్ క్లిప్ జిల్లా పోలీసుల దృష్టికి వచ్చింది. సదరు వార్తకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

విచారణలో సదరు వార్తను “వార్త ప్రభ” రిపోర్టర్ రామకృష్ణ సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఫిర్యాదుదారుని, ఇతర వ్యక్తులను విచారించి సంఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించే చర్యలు చేపట్టారు.

విచారణలో భాగంగా, ఫిర్యాదుదారు శ్యామ్ కుమార్ 16.09.2026న మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి, మచిలీపట్నం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి గొడవలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడైంది. దీనిపై పోలీసులు వెంటనే సిబ్బందిని అక్కడికి పంపించి పరిస్థితిని పరిశీలించారు.

అయితే, అనంతరం సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలో పేర్కొన్న అంశాలు మరియు ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపిన వివరాల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించడంతో, సంఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను పూర్తిగా నిర్ధారించేందుకు మధ్యవర్తుల సమక్షంలో ఫిర్యాదుదారుని మరోసారి విచారించారు.

ఈ విచారణ సందర్భంగా శ్యామ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, 15.09.2026 రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో తానే చీర ధరించి మచిలీపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై కూర్చొని చప్పట్లు కొట్టినట్లు, అనంతరం అక్కడికి కొంతమంది యువకులు వచ్చినట్లు తెలిపాడు. అలాగే, రామకృష్ణ తనకు PGRS లో పరిచయమని, అతని సూచనల మేరకు తాను వ్యవహరించినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో భాగంగా శ్యామ్ కుమార్ తన సెల్‌ఫోన్‌లో రామకృష్ణతో జరిగిన సంభాషణలకు సంబంధించిన వాయిస్ రికార్డింగులను పోలీసులకు చూపించాడు. వాటిలో ఒక రికార్డింగ్‌లో సంఘటనకు సంబంధించి వాస్తవాలకు భిన్నమైన అంశాలను చెప్పాలని సూచించినట్లు, మరో రికార్డింగ్‌లో పోలీస్ స్టేషన్‌కు వెంటనే రాకుండా ఆలస్యం చేయాలని, ఫిర్యాదుకు సంబంధించిన విషయాల్లో ఇతరుల సూచనలను అనుసరించాలని చెప్పినట్లు వినిపించినట్లు విచారణలో గుర్తించారు.