ఎస్పీ జానకి షర్మిలపై ఆరోపణలు పోలీస్ సంక్షేమ సంఘం మద్దతు
ఎస్పీ డా. జి. జానకి షర్మిలపై కొందరు వ్యక్తిగత అభిప్రాయాలు, అసంతృప్తులతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిర్మల్ జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం ఖండించింది. సిబ్బంది సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించడంతో పాటు హోంగార్డులు సైతం ఎస్పీని కలిసి సమస్యలు వివరించే పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సిబ్బందికి కో-ఆపరేటివ్ రుణాల కోసం చర్యలు తీసుకున్నారని, ప్రతిరోజూ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారని వెల్లడించింది.
శాఖాపరమైన బదిలీలు, అటాచ్మెంట్లు, పరిపాలన చర్యలను వ్యక్తిగత నిర్ణయాలుగా చిత్రీకరించడం సరికాదని సంఘం స్పష్టం చేసింది. బాసర ఐఐఐటీ విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధతో పాటు ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేకున్నా సివిల్, ఏఆర్ సిబ్బందితో ట్రాఫిక్, శాంతిభద్రతల విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. సంక్షేమ సంఘం ఎన్నికలను రహస్య బ్యాలెట్‌తో పారదర్శకంగా నిర్వహించినా కుల, మత రంగు పులిమి వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. పోలీసుల ముసుగులో అనామక లేఖలతో సోషల్ మీడియాలో ఎస్పీపై విషప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
