పీఎఫ్ డబ్బులు కావాలా? ఏ అవసరాలకు ఎంత తీసుకోవచ్చు.. క్లెయిమ్ ఎలా చేయాలో పూర్తి వివరాలివే!
EPF Withdrawal Rules: ఈపీఎఫ్ఓ అనేది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకం అయినా మధ్యలో కూడా అవసరాన్ని ఉద్యోగులు పీఎఫ్ డబ్బులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగం వదిలిన తర్వాత లేదా రిటైర్మెంట్ సమయంలో పూర్తి పీఎఫ్ మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పీఎఫ్ విత్‌డ్రా కోసం ఆన్‌లైన్ ద్వారా ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూద్దాం.
PF Withdrawal Online : మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారా? అయితే పీఎఫ్ అకౌంట్ గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా 12 శాతం కంపెనీ పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది. కంపెనీ యాజమాన్యం కూడా అంతే స్థాయిలో డబ్బులు యాడ్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఇచ్చే దాంట్లో 3 శాతానికిపైగా ఈపీఎఫ్ అకౌంట్లో వేస్తే, మరో 8 శాతానికిపైగా ఈపీఎస్ అకౌంట్లో యాడ్ చేస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్లోని నిధుల్ని కేంద్రం ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత ఉపయోగించుకునేందుకే ఉద్దేశించినా, అందులోని డబ్బును ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే ఉద్యోగం చేస్తున్నప్పుడు పూర్తి మొత్తం డబ్బులు తీసుకునేందుకు వీలుండదు.
అవసరాల్ని బట్టి ఉద్యోగంలో కొనసాగుతున్న సమయంలో పాక్షిక నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. అదే ఉద్యోగం నుంచి రిటైర్ అయినప్పుడు లేదా ఉద్యోగం వదిలిన తర్వాత, వర్తించే నిబంధనల ప్రకారం ఫైనల్ సెటిల్మెంట్ ద్వారా పూర్తి పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. ఇంకా పీఎఫ్ విత్‌డ్రా కోసం కారణాన్ని బట్టి వేర్వేరు క్లెయిమ్ ఫారాలు ఉపయోగించాలి. వీరికి సాధారణంగా 3 రకాల క్లెయిమ్ ఫారమ్స్ ఉంటాయి.
ఫారం- 31: పార్షియల్ ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్స్
ఫారం- 19: ఫైనల్ ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్
ఫారం- 10C: పెన్షన్ విత్‌డ్రాయల్ బెనిఫిట్
ఇక్కడ ఏ క్లెయిమ్ చేయాలనేది ఉద్యోగి పరిస్థితి, సర్వీస్, అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
