కాంగోలో ఘోర విమాన ప్రమాదం!
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 25న క్వాంగో ప్రావిన్స్‌లోని కెంజి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
కిన్షాసా నుంచి కిక్విట్కు వెళ్లి తిరిగి వస్తున్న విమానం ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన అనంతరం ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.
ఈ ప్రమాదంలో కాంగో సైనిక న్యాయవ్యవస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సైనిక ఉన్నత న్యాయస్థానం అధిపతి లెఫ్టినెంట్ జనరల్ జోసెఫ్ ముటోంబో కటలయి, అలాగే సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ లూసియన్-రెనే లికులియా బకుమి ఉన్నట్లు కాంగో సైన్యం తెలిపింది.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విమానంలో సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటన కాంగోలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు అధికారులు సంతాపం తెలిపారు.
